ఓర్నీ.. రెండు రోజుల ముందే రివ్యూ పెట్టేశారే

Ghazi-Movie-Reviews-Published-Two-Days-Before-Andhra-Talkies
ఇదెక్కడి పోటీ రా బాబు అన్నట్లుగా మారింది తెలుగు మీడియా యవ్వారం చూస్తుంటే. ఏదైనా జరిగిన వెంటనే ఉన్నది ఉన్నట్లుగా వార్తలు ఇచ్చే వారు కొందరైతే.. ఊహాగానాలతో వార్తలు ఇచ్చేస్తున్న వారు మరికొందరు. కాసేపట్లో ఏం జరుగుతుందో అంచనా వేసేసి.. జరిగిపోయినట్లుగా వార్తలు ఇచ్చేసి.. మళ్లీ నాలుక్కర్చుకొని వెనక్కి తగ్గుతున్న వైనాలు ఈ మధ్య ఎక్కువగానే కనిపిస్తున్నాయి.

మొన్నటికి మొన్నన అమ్మ మరణాన్ని అధికారికంగా ప్రకటించటానికి దాదాపు ఏడెనిమిది గంటల ముందే ప్రకటించేసిందో ప్రముఖ తెలుగు మీడియా సంస్థ ఒకటి.  తెలుగు నేల మీద కాబట్టి సరిపోయింది కానీ.. అదే తమిళగడ్డ మీద ఇలాంటి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తే పరిస్థితి మరోలా ఉండేదన్న మాట మీడియా వర్గాల్లో వినిపించింది. అమ్మ మరణాన్ని సదరు మీడియా సంస్థ రెండుసార్లు చంపేసిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కానీ.. పోటీలో మునిగి తేలుతున్న మీడియా సంస్థలు తమపై వస్తున్న విమర్శల్ని లైట్ తీసుకోవటం లేదన్నది వేరే విషయం.

ఇప్పుడు అలాంటి విచిత్రమైన యవ్వారమే చోటు చేసుకుంది. సినిమా రివ్యూల్ని సినిమా విడుదలకు ముందే పెట్టేసే తీరు కొత్త కానప్పటికీ.. చిన్న చిన్న వెబ్ సైట్లు చేస్తుంటాయి. ప్రీమియర్ షోలు వేసినప్పటికి.. సినిమా విడుదల కాకముందే రివ్యూ బయటకు వచ్చేయటం మర్యాద కాదన్న మాట వినిపిస్తూ ఉంటుంది. పాత్రికేయ ప్రమాణాల పరంగా చూసినా కూడా ఇది నిజమనే చెప్పాలి.

పోటీ పరుగు పందెంలో పడిన తెలుగు మీడియా సంస్థలకు ఇప్పడవన్నీ ఏమీ ఉండటం లేదు. శుక్రవారం విడుదల కానున్న ఘాజీ సినిమా స్పెషల్ ప్రీమియర్ షో ను ఈ రోజు ఉదయం వేశారు. మామూలుగా అయితే.. సినిమా విడుదలకు రెండు రోజుల ముందు ప్రివ్యూలు ప్రదర్శించటం చాలా అరుదు. అందులోకి ఇప్పుడున్న పోటీ పరిస్థితుల్లో ఏ ఒక్కరూ తేడాగా వార్తల్ని స్ప్రెడ్ చేస్తే.. కోట్లాది రూపాయిలు పెట్టిన తీసిన సినిమా మొత్తంగా మునిగిపోతుంది. ఇలాంటి ప్రమాదం ఉన్నప్పటికీ రెండు రోజుల ముందే ప్రివ్యూవేశారంటేనే సినిమా బాగా వచ్చిందన్న నమ్మకం ఉంటే తప్పించి ఆ సాహసాన్ని చేయలేరు.

చిత్రమైన విషయంఏమిటంటే.. సినిమా విడుదలకు రెండు రోజుల ముందు వేసిన ప్రత్యేక ప్రివ్యూ షోను.. తెలుగు మీడియాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థలు పెట్టేయటం. సినిమా బాగుంది కాబట్టి సరిపోయింది. ఒకవేళ..బాగోకుంటే.. ఆ నిర్మాత పరిస్థితి ఏమిటి? ఆ సినిమా పరిస్థితి ఏమిటి? ఏ రకంగా చూసినా సినిమా విడుదలకు ఇన్ని రోజుల ముందు రివ్యూ (ప్రీమియర్ టాక్ అని.. ఫస్ట్ టాక్ అని రకరకాల పేర్లతో పెట్టేస్తున్నారు) ఇచ్చేయటంపై సరికాదన్న వాదన వినిపిస్తోంది. ఎంత పోటీ అయితే మాత్రం ప్రమాణాలు లేకపోవటం ఏమిటి..?
Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...