దాసరి స్థానం కోసం చిరు ప్రయత్నాలా? ఏకి పారేసిన సినీ పెద్దమనిషి

Director-Tammareddy-Bharadwaj-Comments-on-Chiru-and-Jagan-Meeting-Andhra-Talkies.jpg
సినిమా రంగానికి చెందిన వ్యక్తి.. తన మనసుకు ఏమనిపిస్తే దాని గురించి చెప్పేయటం చాలా అరుదు. కనిపించని హద్దులెన్నో సినిమా రంగంలో ఉంటాయి. అలాంటివేళ నిష్ఠూరంగా ఉండే నిజాన్ని ధైర్యంగా చెప్పేయటం.. తర్వాత ఎదురయ్యే ఇబ్బందులకు సై అనటం చాలామంది చేయలేరు. ఈ కారణంతోనే మనకెందుకు వచ్చిందన్నట్లుగా రియల్ లైఫ్ లోనూ రీల్ మాటలు చెప్పి తప్పించుకుంటూ ఉంటారు.

ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తూ.. యూట్యూబ్ హడావుడి ప్రారంభంలోనే నా ఆలోచన పేరుతో అన్ని అంశాల మీద తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పే సినీ పెద్దమనిషి తమ్మారెడ్డి భరద్వాజ. తాజాగా ఆయనో ఆసక్తికర టాపిక్ మీద మాట్లాడారు. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వద్దకు.. ఉప రాష్ట్రపతి వెంకయ్య వద్దకెళ్లి తాను నటించిన సైరా గురించి చెప్పటం తెలిసిందే. ఈ సందర్భంగా పలు రూమర్లు వినిపించాయి.



జగన్ నుంచి ఒక పోస్టు కోసమే చిరు ఇలా చేస్తున్నాడని కొందరంటే.. అదేమీ కాదు.. దాసరి ప్లేస్ ను భర్తీ చేయటం కోసమే ఇలా చేస్తున్నారంటూ బోలెడన్ని ఊహాగానాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది యూట్యూబ్. ఇలాంటి వ్యాఖ్యల్ని తనదైన స్టైల్లో స్పందించారు తమ్మారెడ్డి. మామూలుగానే ఆయన మాటలకు మెగా అభిమానులు తరచూ ఫీలవుతుంటారు. తమ అభిమాన హీరో గాలి తీసేలా తమ్మారెడ్డి మాటలు ఉంటాయన్న పేరుంది.

నిజానికి తమ్మారెడ్డికి అలాంటివేమీ ఉండవు. నిజాన్ని చెప్పే క్రమంలో ఆయన నోటి నుంచి వచ్చే మాటలు నిష్ఠూరంగా మారి.. అలా అనిపిస్తాయంతే. ఇక.. తమ్మారెడ్డి తాజాగా ప్రస్తావించిన అంశంలోకి వెళితే.. యూట్యూబ్ లో కనిపిస్తున్న వీడియోలు చూస్తే తనకు కామెడీగా అనిపిస్తోందన్నారు. ప్రముఖుల వద్దకు వెళ్లి తన తాజా చిత్రమైన సైరాను చిరు చూపించటం వెనుక స్వర్గీయ దాసరి ప్లేస్ ను రీప్లేస్ చేసేందుకు అంటూ వినిపిస్తున్న వాదనలో ఏ మాత్రం నిజం లేదన్నారు. ఇది కామెడీకి పరాకాష్ఠగా ఆయన అభివర్ణించారు.

చిరంజీవి అనుకోవాలే కానీ సినిమా ఇండస్ట్రీలో ఆయనకు ఏ ప్లేస్ పెద్దది కాదన్నారు. ఆయన తలుచుకుంటే ఏ స్థానాన్ని అయినా తీసుకోవచ్చు. దాసరి పొజిషన్ అధికారిక పదవి ఎంతమాత్రం కాదు. నిజానికి అక్కడ ఎలాంటి పదవీ లేదు. పెద్దమనిషిగా వ్యవహరించేవారు.. అందరితో మాట్లాడేవారు. చిరంజీవి కూడా అలా చేయాలంటే చేయొచ్చు కూడా.

వాస్తవానికి ఆయన్ను అలా చేయాలని తానే రెండు మూడు సార్లు అడిగిన విషయాన్ని బయటపెట్టారు తమ్మారెడ్డి. ‘‘మా’’కు సంబంధించి గతంలో కలుగజేసుకోవాలని చెబితే.. ఒక ఇష్యూలో ఇన్ వాల్వ్ అయి ఇష్యూను సెటిల్ చేసిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు. ఇండస్ట్రీలో ఏమైనా చేయాలనుకుంటే చిరంజీవే నేరుగా చేయొచ్చు. దానికి జగన్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఏముంది?

జగన్ ఏమైనా చెప్పారా? ఆయన ఏమైనా పదవి ఇస్తారా? అందుకోసం చిరంజీవి వెళతారా? అసలు వీళ్లకు తెలిసి మాట్లాడతారో.. తెలీక మాట్లాడతారో.. వీరిదెంత అమాయకత్వం అంటూ ఎటకారం ఆడేస్తూ చిరు పేరుతో ఏదో ఒకటి చెప్పేస్తే తమకేదో వస్తుందని అనుకోవటానికి మించిన మూర్ఖత్వం ఏముంటుందంటూ ఘాటుగానే రియాక్ట్ అయ్యారు.

దీనికి మించిన మరో జోకును మరికొందరు ప్రచారం చేస్తున్నారని.. అదేమంటే గంటాను జగన్ పార్టీలోకి తీసుకెళ్లేందుకు చిరు మధ్యవర్తిత్వం చేస్తున్నారని ఆ ఇష్యూ మీదా తన ఆలోచనను చెప్పేశారు. గంటా కావాలనుకుంటే ఏ పార్టీలోకైనా వెళ్లగలడు. అతనికి ఆ సామర్థ్యం.. డబ్బు ఉంది. అలాంటప్పుడు గంటాను చిరు తీసుకెళ్లి వేరే పార్టీలో చేర్పించాల్సిన అవసరం లేదు. ఇలా ప్రతి విషయానికి చిరును ఏదోలా లాగటం ఏమిటి? సోషల్ మీడియాను పిచ్చి పిచ్చి వాటికి వాడేయటం ఏమిటంటూ తనదైన స్టైల్లో చిరాకు పడ్డారు తమ్మారెడ్డి.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...