నాగబాబు... కెల్విన్ అయిపోయాడే!

Naga-Babu-seems-to-have-appealed-Media-not-to-circulate-his-photograph-as-that-of-Calvin-Andhra-talkies-telugu
తెలుగు రాష్ట్రాలను ప్రత్యేకించి తెలుగు సినీ ఇండస్ట్రీ టాలీవుడ్ ను అతలాకుతలం చేసేస్తున్న డ్రగ్స్ దందాలో రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది. ఈ విషయాలన్నీ నిజమో - కాదో తెలియదు గానీ... తెరపైకి వచ్చిన ప్రతి అంశంపైనా పెద్ద చర్చే జరుగుతోంది. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన తెలంగాణ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ - ఆయన బృందం సభ్యులను ఊటంకిస్తూ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. ఈ విషయాల్లో కొన్నింటినీ స్వయంగా దర్యాప్తు బృందమే విడుదల చేసిందన్న వాదన కూడా లేకపోలేదు. అయితే పూర్తి వివరాలను అందించకుండా... ఆయా విషయాలకు సంబంధించిన క్లూలు విడుదల చేస్తూ దర్యాప్తు అధికారులు కేసుకు ఉన్న ప్రాధాన్యాన్ని అటు జనానికి ఇటు ప్రభుత్వానికి తెలిసేలా చేశారన్న వాదన కూడా వినిపిస్తోంది.

ఈ క్రమంలో ఈ దందాతో సంబంధం ఉందన్న ఆరోపణలతో ఇప్పటికే టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - సినిమాటోగ్రాఫర్ శ్యాం కే. నాయుడులను సిట్ అధికారులు విచారించారు. ఈ విచారణ సందర్భంగా పోలీసులు ఓ వ్యక్తి ఫొటోను పూరీ జగన్నాథ్ ముందు పెట్టినట్లుగా వార్తలు వినిపించాయి. సదరు ఫొటో ఇటీవల జరిగిన జ్యోతిలక్ష్మి ఆడియో ఫంక్షన్కు చెందినదని అందులో కెల్విన్ ఉన్నాడని ప్రచారం జరిగింది. ఇదే అదనుగా సదరు ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి ఇతడేనంటూ మీడియా అత్యుత్సాహం ప్రదర్శించింది. అసలు పోలీసులు ఏ ఫొటోను పూరీ ముందు పెట్టారో అసలు అలాంటి ఘటన విచారణలో జరిగిందో లేదో కూడా ఒక్క సిట్ సభ్యులతో పాటు పూరీకి మాత్రమే తెలుసు. అలాంటిది తమ సమక్షంలోనే విచారణ జరిగిందన్నట్లుగా కొన్ని మీడియా సంస్థలు ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి కెల్వినేనని ఇతడే కెల్విన్ అంటూ ఓ ఫొటోను ప్రసారం చేశాయి.

అయితే ఆ ఫొటో కెల్విన్ ది కాకపోగా... బెంగళూరుకు చెందిన నాగబాబు అనే వ్యక్తిదట. ఈ విషయాన్ని స్వయంగా నాగబాబే మీడియా ఛానెళ్లకు ఫోన్ చేసి మరీ వివరిస్తే గానీ జరిగిన పొరపాటు తెలియలేదట. తెలుగు న్యూస్ ఛానెళ్లలో తన ఫొటో వస్తున్న విషయాన్ని తెలుసుకున్న నాగబాబు... దానిని నిర్ధారించుకుని అక్కడి నుంచే ఆయా మీడియా సంస్థలకు ఫోన్ చేశాడట. మీరు చూపిస్తున్న ఫొటో కెల్విన్ ది కాదు.. ఆ ఫొటో తనదేనని  కావాలంటే... మెయిల్ ఐడీ - బ్యాంక్ ఖాతా - ఫేస్ బుక్ ఖాతాలను పరిశీలించాలని కూడా నాగబాబు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. నాగబాబు ఫోన్ నేపథ్యంలో.. ఇప్పుడదంతా వట్టిదే అని తేలిపోయింది. నిజనిజాలు నిర్దారించుకోకుండా మీడియా మరోసారి అత్యుత్సాహం ప్రదర్శించదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

1 comment:

  1. మీడియా తన పరువు తానె పోగొట్టుకునే ప్రక్రియలో ఇది మరొక చర్య.

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...